శివుడి జటాజూటం నుంచి భూమికి దిగిన పవిత్ర గంగా అలలతో గోదావరి తీరాలు కార్తిక దీపాల కాంతులతో మెరిసిపోయాయి. ‘న కార్తికే నమో మాసః, న గంగా సదృశం తీర్థం’ అనే శ్లోకానికి ప్రతిరూపంగా, పవిత్ర గోదావరి తీరాన సోమవారం మున్సిపల్ మైదానంలో ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక దీపోత్సవం నిర్వహించారు.
రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఏఎస్పీ ఏవీ సుబ్బరాజు, ‘ఈనాడు’ రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి ఐ.వి. శ్రీనివాస సుబ్రహ్మణ్యం తదితరులు జ్యోతి వెలిగించి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. “హరహర మహాదేవ, శంభో శంకర” నినాదాలతో మైదానం మార్మోగి, వేలాది మంది భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దీపాల వెలుగులతో సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం దివ్య కాంతులతో దివ్యరూపాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంలో ఆర్షవిద్య తపస్వి పశర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు గోదావరి నది మహిమ, కొవ్వూరు గోష్పాద క్షేత్ర విశిష్టతలను భక్తులకు వివరించారు. లక్ష్మీదేవి గోవు రూపంలో నిశ్చలంగా ఉంటారని, లక్ష్మీ కటాక్షం కోరుకునేవారు గోరక్షణను ఆచరించాలని సూచించారు.
దీపోత్సవానికి సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏఎస్పీలు మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు జ్ఞాపికలు అందజేశారు. శ్రీ వేంకటేశ్వర ఫైనాన్స్, హిందూస్థాన్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రతినిధి మేడపాటి వెంకటరెడ్డి, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె ప్రతినిధి పీవీ నారాయణరావు సహా పలువురు ఈ సందర్భంగా సత్కారం పొందారు.
తిరుమల ఐఐటీ, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, శ్రీకౌ అండ్ కాఫ్ రైస్ & ఇడ్లీ రవ్వ, కామధేనుం మిల్క్, జున్ను పౌడర్ సంస్థలు కార్యక్రమానికి సహకరించాయి. వైదిక నిర్వాహకుడు పులుపుల ఫణికుమార శర్మ బృందం గణనాథుని పూజతో దీపోత్సవాన్ని ప్రారంభించగా, పందిరి మహదేవుడు స్మార్త వేదపాఠశాల పండితులు మాధవానంద శర్మ శిష్య బృందం వేదపఠనం చేశారు.
ముఖ్య అతిథులకు పండితులు ఆశీర్వచనం అందించగా, సుజిత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటుచేసి, ఆరోగ్యశాఖ వైద్యశిబిరం కూడా నిర్వహించింది. చివరగా ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏఎస్పీలు మురళీకృష్ణ, సుబ్బరాజు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.




















