తన కుమారుడు మాగంటి గోపీనాథ్ మరణంపై అనేక కోణాల్లో అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి మాగంటి మహానందకుమారి తెలిపారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆమె మాట్లాడగా, “గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే, తల్లిగా ఆయనను ఒకసారి చూడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆయన మరణించినట్లు కేటీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రకటించారు. వారసత్వ పత్రంలో నా పేరు, ఆయన మొదటి భార్య మరియు పిల్లల పేర్లు లేవు. ఇది డబ్బు సమస్య కాదు; మాకు గుర్తింపు లభించడంలో లోపం ఉంది. గోపీనాథ్‌కు మొదటి భార్య మాలినితో విడాకులు కుదరలేదు. మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నా కూతురు సునీతకు టికెట్ ఇవ్వడంలో ఒక మాట కూడా చెప్పకపోవడం బాధాకరంగా ఉంది. లీగల్ హైర్ సర్టిఫికెట్ కోసం ఆగస్టు 11 నుంచి తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు” అని ఆమె పేర్కొన్నారు.
మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న మాట్లాడుతూ, “నా పాస్‌పోర్టు మరియు ఇతర పత్రాల్లో తండ్రిగా గోపీనాథ్ పేరు ఉంది. తహసీల్దారు కార్యాలయంలో అన్ని వివరాలు సమర్పించాము. గోపీనాథ్‌కు మా అమ్మతో చట్టపరంగా విడాకులు కాలేదు. జూన్ 6న మాగంటి సునీత మొదటిసారిగా నాకు ఫోన్ చేసింది. మా నాన్న గ్రాడ్యుయేషన్ డేకి రావాలని అనుకున్నారు, కానీ హఠాత్తుగా చనిపోయారు. ఆ తర్వాత సునీత ఫోన్ చేసి ‘నువ్వు ఇండియాకు రావాల్సిన అవసరం లేదు, కేటీఆర్ అంకుల్ కంపెనీల్లో ఉద్యోగం ఇస్తాం’ అన్నారు” అని తారక్ పేర్కొన్నారు.


















