వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైకాపా బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ముందుగానే హెచ్చరించినా, నేతలు దానిని పట్టించుకోలేదు. గరివిడి నుంచి చీపురుపల్లి వరకు ప్రధాన రహదారి గుండా బైక్ ర్యాలీగా వైకాపా కార్యకర్తలు బయలుదేరగా, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వెనుక కారులో ప్రయాణించారు. గరివిడి ఆర్వోబీ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. అయితే, కార్యకర్తలు వాటిని పట్టించుకోకుండా పోలీసులను తోసివేసి, బారికేడ్లు తొలగించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులుతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఉద్రిక్తత కారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గర్భిణిని తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోగా, పోలీసులు జోక్యం చేసుకుని దానికి మార్గం కల్పించారు. బొత్స సత్యనారాయణ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుని కొంతసేపు కారులోనే ఉండిపోయారు. అనంతరం పోలీసులు ఒక్కో వాహనాన్ని తరలిస్తూ ట్రాఫిక్‌ను సవ్యంగా నిర్వహించారు.
పోలీసులే ధర్నా చేసినట్టున్నారు: బొత్స
ఈ ఘటనపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “పోలీసులే రాస్తారోకో, ధర్నా చేసినట్టున్నారు” అని వ్యాఖ్యానించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, “గరివిడి నుంచి చీపురుపల్లి వరకు బైక్ ర్యాలీకి పోలీసులు గంటన్నరపాటు ఆటంకం కలిగించారు. పేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలి. రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లు ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించామని చెబుతున్నారు. వాటికి భూసేకరణ, శంకుస్థాపనలు ఎప్పుడు జరిగాయో చెప్పాలి. కల్తీ నెయ్యి కొనుగోలుకు సంబంధించి తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత ఆ విషయంపై మాట్లాడతాను” అన్నారు.
విశాఖ సమిట్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “మా హయాంలో జరిగిన సమిట్ ద్వారానే అత్యధిక పెట్టుబడులు వచ్చాయి” అని బొత్స సత్యనారాయణ తెలిపారు.



















