ఓ తెలుగు సినిమా ప్రొడక్షన్ మేనేజర్‌కి చిత్రీకరణ కోసం పదిహేను గదులున్న పాత పెద్ద ఇంటి అవసరం వచ్చింది. ఈ విషయం తెలిసిన ఒక స్థానికుడు, “అయ్యా! మావూరి పెద్దాయన ఇల్లు ఒకటుంది, వచ్చి చూసి నచ్చితే తీసుకోండి” అంటూ తీసుకెళ్లాడు. అదే ఇల్లు తర్వాత ‘శతమానం భవతి’ సినిమాలో హీరో శర్వానంద్ కుటుంబం నివసించే ఇంటిగా చూపారు — ఆ ఇంటి స్థలం పెనుగొండ మండలంలోని ఇలపర్రు గ్రామం.
కేరళ సోయగాలకు ఏమాత్రం తీసిపోని అందమైన లొకేషన్ల పుట్టినిల్లు ఉమ్మడి గోదావరి జిల్లానే. సినిమాల చిత్రీకరణకు అనువైన ప్రదేశాలు ఇక్కడ ప్రతి ఊర్లోనూ లభిస్తాయి. కథకు తగ్గ సన్నివేశాలు తీయడానికి, పాటలను అందంగా రూపుదిద్దడానికి కావలసిన ప్రకృతి సోయగాలు, చారిత్రక కట్టడాలు, గోదావరి తీరం, సముద్రతీరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. నిర్మాతలకు తక్కువ ఖర్చుతో, చాలాసార్లు ఉచితంగా కూడా ఆతిథ్యమిచ్చే పెద్ద మనసులు ఇక్కడ కొదవే లేవు. అలనాటి ఏఎన్నార్ ‘మూగమనసులు’ నుంచి తాజా ‘అనగనగా ఒక రాజు’ వరకు ఉమ్మడి జిల్లాలో అనేక సినిమాలు చిత్రీకరించబడ్డాయి. పాలకొల్లులో జాతీయ స్థాయి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభమవడంతో ఈ ప్రాంతం సినీ ప్రపంచానికి మరింత కేంద్రంగా మారబోతోంది.
సమీప లొకేషన్ల సౌలభ్యం:
ఉమ్మడి జిల్లాలో ఒక లొకేషన్ నుంచి మరోదానికి వెళ్లడం చాలా సులభం. ఉదాహరణకు — గోదావరి తీరం సన్నివేశాలు తీయాలన్నా, సముద్రతీర దృశ్యాలు చిత్రీకరించాలన్నా యలమంచిలి, నరసాపురం, పేరుపాలెం ప్రాంతాలు దగ్గరగానే ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు అవసరమైతే ద్వారకాతిరుమల నుంచి పంచారామాల వరకు అనేక దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి. పట్టిసీమ వంటి ప్రదేశాలు వందల సినిమాలకు వేదికగా నిలిచాయి. కళాశాలలు, చిన్న రైల్వే స్టేషన్లు వంటి వివిధ బ్యాక్‌డ్రాప్‌లు కూడా ఇక్కడ లభిస్తాయి.
తాజా చిత్రీకరణలు:
జగపతిబాబు నటించిన ‘గోదారి గట్టు మీద’ సినిమా ఇరగవరం మండలం రేలంగిలో చిత్రీకరించబడింది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా పాలకొల్లులో చిత్రీకరించారు. సునీల్ హీరోగా వస్తున్న ‘కొక్కొరొక్కో’ చిత్రంలోని పలు సన్నివేశాలు నరసాపురం–సఖినేటిపల్లి ప్రాంతంలోని గోదావరిపై పంటులో తీశారు. బూరుగుపల్లిలో మరో షెడ్యూల్ జరగనుంది. ప్రవీణ్ నటించిన ‘బకాసుర రెస్టారెంట్’ సినిమాను పేరుపాలెం బీచ్‌లో చిత్రీకరించారు. గతంలో నాని హీరోగా వచ్చిన ‘టక్ జగదీష్’, వెంకటేష్–నాగచైతన్యల ‘వెంకీమామ’ సినిమాల్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కూడా పాలకొల్లులోని వెంకటాపురం పెంకుడుశాలలో చిత్రీకరించారు.



















