ప్రస్తుత కార్తికమాసంలో నదులు, ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ తీరాల్లో స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో భక్తుల రద్దీ మరింతగా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో భక్తులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అవసరం.
శీతాకాలం ప్రారంభం కావడంతో తెల్లవారుజామున పొగమంచు కురుస్తోంది. రహదారులు స్పష్టంగా కనిపించకపోవడంతో సొంత వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం 4 నుండి 5 గంటల మధ్య ప్రయాణాన్ని నివారించడం మంచిది.
నదీ తీరాల్లో కొన్నిచోట్ల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. స్నానాలు చేసే సమయంలో మహిళలు, పిల్లలు ఘాట్‌ల వద్ద ఉన్న ఇనుప రైలింగ్ పట్టుకుని ఉండాలి. పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు.
వనభోజనాలకు వెళ్లే వారు సమీపంలోని చెరువులు, వాగులు, జలపాతాల్లో సరదాగా స్నానం చేయకూడదు. ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోయే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలి.
అదేవిధంగా, నదుల్లో భక్తులు అధికంగా స్నానాలు చేయడం వల్ల నీరు కలుషితమవుతుంది. కాబట్టి స్నానం చేసే సమయంలో నీటిని మింగకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు.


















