దిల్లీ: హిమపాతాన్ని దాటివెళ్ళి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, జమ్మూకశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఏ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనగలిగే విధంగా సర్వసన్నద్ధంగా ఉండాలని గురువారం భద్రతాదళాల చీఫ్‌లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సూచించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి మేలు చేయని ఏ ప్రయత్నం అయినా అడ్డుకోడానికి భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నదని, మోదీ ఆశయానుసారంగా ఉగ్రవాద రహిత కశ్మీర్ కోసం మరింత సన్నద్ధం కావాలని హోంమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంస్ఖాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ నళిన్ ప్రభాత్, సీఆర్‌పీఎఫ్ డీజీ జీపీ సింగ్, బీఎస్‌ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




















