తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్త పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టు ప్రాతఃకార్యాలు ముగిసిన తర్వాత, గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు. తరువాత పల్లకీలో మాడవీధి ద్వారా పుష్కరిణికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించబడింది. ఆ తరువాత వేదమంత్రోచ్ఛరణల మధ్య శుభ ముహూర్తంలో చక్రాన్ని పుష్కరిణిలో మూడుసార్లు ముంచి ద్వాదశి చక్రస్నాన మహోత్సవాన్ని ముగించారు. ఈ వేడుకలో భక్తులు, అధికారులు, సిబ్బంది భారీగా పాల్గొన్నారు.



















