భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆధునిక చర్యలను చేపడుతోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక తాజాగా, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్ సేవలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థల నుండి టెండర్లు ఆహ్వానించగా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్ క్లౌడ్ వంటి సంస్థలు పోటీలో పాల్గొన్నాయి. వీటిలో ఏడబ్ల్యూఎస్ సంస్థ సంవత్సరానికి రూ.50 లక్షలతో సేవలు అందించేందుకు ముందుకు రావడంతో, ఆ టెండర్‌ను టీటీడీ ఆమోదించింది.
త్వరలో భక్తులకు ఈ ఏఐ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ఆన్‌లైన్ శ్రీవారి దర్శనం, సేవలు, వసతిగదులు, విరాళాలు వంటి వివరాలను భక్తులు తక్షణమే తెలుసుకోగలరు. అలాగే ఫిర్యాదులు, సూచనలు కూడా సులభంగా పంపించవచ్చు.
దాదాపు 13 భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ సంస్థ అభివృద్ధి చేస్తోందని టీటీడీ డిప్యూటీ ఐటీ జీఎం వెంకటేశ్వరనాయుడు తెలిపారు.



















