మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు అడ్డంకిలేకుండా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాస్కో 1,20,000 గ్లైడ్ బాంబులను తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో 500 కొత్త లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉంటాయని, ఈ ఏడాది చివరికి వాటి తయారీ పూర్తి కానుందని పేర్కొన్నారు. ఈ బాంబులు 12 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా చేరగలవని చెప్పారు.
సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఆరోపణల ప్రకారం, రష్యన్ దళాలు ప్రతిరోజూ ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై 200–250 గ్లైడ్ బాంబులతో దాడులు జరుపుతున్నాయి. ప్రతి దాడితో రష్యా తమ బాంబుల పరిధిని పెంచుకుంటున్నారని, 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల బాంబులు రూపొందించే ప్రణాళికలు మాస్కో సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తయారవుతున్న బాంబులు ఉక్రెయిన్‌కి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశముందని, వాటిని ఎదుర్కోవడానికి కీవ్ సైన్యాలు సన్నద్ధమవుతున్నట్లు ఆయన చెప్పారు.
ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి ఆరోపణలపై రష్యా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, కీవ్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారంటూ ఆరోపణలను రష్యా ఖండించింది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి తర్వాత రష్యా ఆయుధ ఉత్పత్తిని భారీగా పెంచింది. మాస్కోలో రక్షణ రంగ కర్మాగారాలు 24 గంటలూ పని చేస్తున్నాయి. గత నెలలో రష్యా సైన్యం భారీ స్థాయిలో అణు విన్యాసాలను నిర్వహించింది, ఈ కార్యక్రమాన్ని పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు. ఆ సందర్భంలో అణుశక్తి ఆధారిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ మరియు ‘బురెవెస్ట్‌నిక్’ క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్టు సైనిక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు.




















