దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న పుణ్యక్షేత్రం, సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున దర్శనాలు నిలిపివేశారు. ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ జరిగే అర్చక కైంకర్యాలు సక్రమంగా కొనసాగుతున్నాయి. విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఆలయం చుట్టూ ఇనుప రేకుల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు సహా ఇతర ప్రాంతాల గేట్లను మూసి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనాలు నిలిపివేసినప్పటికీ, ఆలయం ముందు ప్రచార రథం, ఎల్ఈడీ తెర ద్వారా భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అదనంగా, స్వామివారికి కోడె మొక్కులు, వివిధ ఆర్జిత సేవలను చెల్లించుకునేందుకు శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని సమాచారం. బందోబస్తు, ఇతర ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య, పలువురు సీఐలు, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ విజయప్రకాశ్రావులు పర్యవేక్షించారు.




















