రైతులకు అండగా నిలుస్తామని, వచ్చే రెండు నెలల్లో డ్రెయిన్లు, కాలువలు, ఇతర ఆక్రమణలను తొలగించి నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఉండి మండలం వాండ్రంలంకలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వరిచేలను కలెక్టర్ నాగరాణితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉండి నియోజకవర్గంలో సుమారు 80 శాతం డ్రెయిన్లు, కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి నీటిపారుదల వ్యవస్థను స్థిరపరిచామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కులమతాలకు అతీతంగా ఆక్రమణలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కౌలు రైతులకు సీసీఏ కార్డుల మంజూరులో ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గ్రామంలోని 900 ఎకరాల్లో సుమారు 50 ఎకరాల వరి పంట నష్టపోయిందని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాలకోడేరు బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, తోట ఫణిబాబు, కందుల బలరాం, కరిమెరక నాగరాజు, కాగిత బుజ్జి, అప్పల కృష్ణ, సూరవరపు వెంకటాచార్యులు, జిల్లా వ్యవసాయాధికారి జెడ్. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నాగార్జున, ఏడీఏ జీవన్ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, వీఆర్‌వో చిన్నారావు, గ్రామ కార్యదర్శి నాయుడు తదితరులు పాల్గొన్నారు.




















