మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం
కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం
పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు వీరోచితంగా పోరాడారు
కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేష్
శేషగిరిరావు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ
ఉండవల్లిః మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అని, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి లోకేష్.. నేడు ఉండవల్లి నివాసంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. 2024 ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంట్ గా ఉన్న శేషగిరిరావు వీరోచితంగా పోరాడి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచారు. రెండు నెలల క్రితం ఆయన గుండె పోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో దివంగత శేషగిరిరావు సతీమణి కృష్ణవేణితో పాటు కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్న మంత్రి లోకేష్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
నంబూరి శేషగిరిరావు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తామంతా శేషగిరిరావు కుటుంబానికి అండగా ఉంటామని, కుటుంబ బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.




















