శాస్త్రాలలో ఇలా అంటారు — “విష్ణువుతో సమానమైన దేవుడు లేడు, గంగతో సమానమైన తీర్థం లేదు, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదు.”
ఈ పవిత్రమైన మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన కాలం. కానీ ఈ మాసం ఎందుకు ఆయనకు ప్రత్యేకమైందో తెలుసుకోవాలంటే — యశోదా-కృష్ణుల మధ్య చోటుచేసుకున్న ఆ హృదయాన్ని కదిలించే సంఘటనను గుర్తు చేసుకోవాలి.
ఒక రోజు యశోదా దేవి మజ్జిగ చిలుకుతూ ఉండగా చిన్న కృష్ణుడు ఆకలిగా వచ్చి తల్లిని పిలిచాడు. వెంటనే యశోదా చిలకడం ఆపి పాలు ఇస్తుండగా, పొయ్యిపై ఉంచిన పాలు పొంగిపోతున్నాయన్న విషయం గుర్తొచ్చింది. కృష్ణుడిని కింద ఉంచి వంటగదికి వెళ్లిపోయింది.
తల్లి తనను మధ్యలో వదిలేసి వెళ్లిపోవడంతో చిన్న కృష్ణుడు కోపంతో ఆ వెన్నకుండను పగలగొట్టి రోలు మీద కూర్చుని వెన్న తినసాగాడు. తిరిగి వచ్చిన యశోదా తన బిడ్డ కనిపించక వెతికితే, రోలు మీద వెన్న తింటూ ఉన్న కృష్ణుడు కనిపించాడు.
తల్లి మందలించగానే కృష్ణుడు భయంతో పరుగెత్తాడు. యశోదా అతన్ని పట్టుకుని తాడుతో కట్టాలని చూసింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే — ఎంత తాడు తీసుకున్నా అది కృష్ణుడి పొట్ట చుట్టడానికి సరిపోలేదు! చివరికి తన తల్లి కష్టపడుతూ ఉండడాన్ని చూసి, తల్లి ప్రేమకు మృదువైన కృష్ణుడు తన దివ్యశక్తితో ఆ తాడు సరిపడేలా చేసి తానే కట్టించుకున్నాడు.
అలా తల్లితో ప్రేమతో కట్టుకున్న “దామము” (తాడు) కారణంగానే ఆయనకు దామోదరుడు అనే పేరు వచ్చింది. ఈ సంఘటన జ్ఞాపకార్థమే ఈ మాసాన్ని కార్తీక దామోదర మాసం అంటారు.
తల్లి కట్టిన ఆ రోలుతో ఆడుకుంటూ ఉన్న కృష్ణుడు, ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్య ఇరుక్కుపోయాడు. రోలు లాగడంతో చెట్లు వేర్లతో సహా కూలిపోయాయి. వాటి నుంచి వెలువడిన దివ్య రూపాలు కుబేరుని కుమారులు — నలకుబేరుడు మరియు మణిభద్రుడు.
మునుపు నారద మునిని అవమానించినందుకు వారు మద్దిచెట్లు అయ్యారు. కానీ నారదుడు వారిని క్షమించి, “శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆయన స్పర్శతో మీకు శాప విమోచనం కలుగుతుంది” అని ఆశీర్వదించాడు. ఆ విధంగానే కృష్ణుడి స్పర్శతో వారు విముక్తి పొందారు. కృతజ్ఞతతో కృష్ణుడిని స్తుతిస్తూ దామోదరాష్టకం గానం చేశారు.
ఇదే ఆ దామోదర మాసం యొక్క మూలకథ. అందుకే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో ఈ మాసాన్ని ఎంతో భక్తితో జరుపుకుంటారు.
ఈ కాలంలో భక్తులు శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర వ్రతం లేదా శ్రీ రాధా దామోదర వ్రతం ఆచరిస్తారు.
అలాగే ఈ మాసంలో ప్రతిరోజూ దేవాలయంలో శ్రీ కేశవుని ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించే వారు సంతానం, దీర్ఘాయుష్షు, అష్టైశ్వర్యాలు పొందుతారని స్కంద పురాణం పేర్కొంటుంది.



















