ప్రత్యర్థిని ఊపిరితీసుకోనీయకుండా అటాకింగ్ గేమ్ ఆడటం అతడి స్పెషాలిటీ. అది ఐపీఎల్ అయినా, దేశవాళీ అయినా సరే దూకుడుగా ఆడటమే అతడి నైజం. కుర్రాడు దుమ్మురేపేస్తున్నాడు.. ఈ మాట వైభవ్ సూర్యవంశీకి ఇది చాలా చిన్న ప్రశంసే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందా? ‘క్రికెట్ దేవుడు’ రికార్డు బద్దలు కాబోతుందా?
వైభవ్ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియాతో యూత్ టెస్టులు ఆడుతున్నాడు. తాజాగా 78 బంతుల్లోనే సెంచరీ చేసిన అతడు ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ స్టార్ మెక్‌కల్లమ్ సరసన చేరాడు. యూత్ టెస్టుల్లో 100లోపు బంతుల్లోగానే రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. అంతకుముందు ముందు 58 బంతుల్లోనే ఆసీస్‌పైనే అండర్ -19 జట్టు తరఫున శతకం బాదాడు.
అక్కడ్నుంచే మొదలు..
రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా ఒక్క సీజన్‌కు మాత్రమే బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్.. ఓ అద్భుతమైన క్రికెటర్‌ను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చాలా మందిలానే వైభవ్ కూడా పేరు నమోదు చేసుకున్నాడు. ఎవరు తీసుకుంటారులే అంతా అనుకున్నారు. కానీ, వైభవ్ టాలెంట్‌ను గుర్తించిన ద్రవిడ్ మాత్రం పట్టుబట్టి తన జట్టులోకి తీసుకున్నాడు. ఆ మెగా వేలంలో రూ. 1.10 కోట్లు దక్కించుకుని వైభవ్ సంచలనం సృష్టించాడు. అయితే, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వంటి ఓపెనర్లు ఉండగా ఛాన్స్ రావడమూ కష్టమని భావించినవారూ లేకపోలేదు. అనూహ్యంగా సంజును వన్‌డౌన్‌లో పంపించిన మేనేజ్‌మెంట్ వైభవ్‌కు అవకాశం కల్పించింది. ఏడు మ్యాచుల్లో రికార్డు సెంచరీతో సహా 252 పరుగులు రాబట్టాడు. అప్పట్నుంచి అతడి పేరు మారుమోగిపోయింది. ఇక యూత్ వన్డేలు, టెస్టుల్లోనూ చెలరేగిపోవడంతో భారత జట్టులోకి ఎంట్రీనే తరువాయి అన్నట్లుగా అతడి హవా కొనసాగుతోంది.
ఐసీసీ నిబంధన అడ్డే.. కానీ
ఇప్పటికిప్పుడు వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసే వారు చాలా మంది ఉన్నారు. కానీ, ఐసీసీ నిబంధన మాత్రం అతడికి అడ్డు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు కనీస వయసును 15 ఏళ్లుగా నిర్దేశించింది. అప్పుడే సదరు ప్లేయర్ మానసికంగానూ కాస్త మెరుగ్గా ఉంటాడనే ఉద్దేశంతో అలా పెట్టింది. కానీ, వైభవ్‌లా అత్యుత్తమ ప్రతిభ కలిగిన ప్లేయర్‌ను ఆడించడంపై ఆయా బోర్డుల నుంచి వచ్చే విజ్ఞప్తులను ఆమోదించే అవకాశమూ ఉంది. ప్రత్యేక అనుమతి తీసుకుని జట్టులోకి ఎంపిక చేయొచ్చు. అలా అనుకుంటే.. ప్రస్తుతం వైభవ్ వయసు 14 ఏళ్ల 200+ రోజులు. జాతీయ జట్టులోకి రావాలంటే మార్చి వరకూ ఆగాలి. అయితే, ప్రత్యేక అనుమతి తీసుకుంటే ఆ సమయం కూడా అక్కర్లేదు. 15 ఏళ్లు దాటాక జాతీయ జట్టుకు ఎంపికై తొలి మ్యాచ్ ఆడితే.. సచిన్ రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. ఎందుకంటే సచిన్ తన తొలి మ్యాచ్‌ను 16 ఏళ్ల 238 రోజుల వయసులో ఆడాడు.


















