ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్ వనరులు అందిస్తోందంటూ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన జెలెన్స్కీ భారత్ తమవైపే ఉందంటూ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ చేసుకొన్న ఇంధన ఒప్పందం తమకు సమస్యగా మారినప్పటికీ దీనిని ట్రంప్ పరిష్కరించగలరని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకొనే విషయంలో మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
అయితే భారత్‌లా చైనా తమకు మద్దతిస్తుందని చెప్పలేమని జెలెస్స్కీ అన్నారు. ఎందుకంటే రష్యాతో జరుగుతున్న యుద్ధం ముగియడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని చైనా భావించడమే కారణమన్నారు. అయినప్పటికీ ట్రంప్ యుద్ధం విషయంలో జిన్‌పింగ్ వైఖరిని మార్చగలరని భావిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించిన నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలు నిధులు సమకూరుస్తున్నాయని విమర్శించారు. నాటో దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనాన్ని, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయడం తగ్గించలేదన్నారు. అందువల్లే ఈ యుద్ధాన్ని ఆపడానికి మరిన్ని శక్తిమంతమైన సుంకాలను విధించడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అవి త్వరలోనే అమల్లోకి వస్తాయన్నారు. మరోవైపు రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచే భారత్‌లో అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమేనని అప్పట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.




















