ఒక రైతు రోజంతా ఎంతో కష్టపడి తన చెరకు తోట కోసం నీరు తోడాడు. తీరా సాయంత్రం చూస్తే పొలం కొద్దిగానే తడిచింది. ఆ నేలలో ఎక్కడ చూసినా ఎలుకల కలుగులు ఉన్నాయి. రైతు తోడిన నీరంతా వాటి ద్వారా భూమిలోకి ఇంకిపోయింది. ముక్తిని కోరుకుంటూ నిర్మలమైన మనసుతో భగవంతుణ్ని ఆరాధించాలే తప్ప.. లోలోపల కీర్తి కోసం, సుఖాలు, సౌకర్యాలు, సంపదలు,
పదవుల కోసం పూజించకూడదు. అలా చేస్తే ఆ వ్యక్తి పరిస్థితి పైన చెప్పిన రైతులాగే తయారవుతుందని రామకృష్ణ పరమహంస హెచ్చరించారు. అలాంటి వ్యక్తి నిత్యం దేవుణ్ని
ప్రార్థిస్తున్నా జీవితంలో నిజమైన అభివృద్ధీ ఆనందం ఉండవని, అతడి భక్తి మొత్తం.. కోరికలనే ఎలుక కలుగుల ద్వారా వ్యర్థమైపోతుందని వ్యాఖ్యానించారు. జిడ్డుగా ఉన్న అద్దంలో ముఖం సరిగ్గా కనిపించదు. అలాగే కోరికలు అనే మలినాలతో నిండిన హృదయంలో భగవంతుడి స్వరూపం ప్రకాశించదు. జిడ్డును తుడిచేస్తే స్పష్టత వచ్చినట్లు, నిర్మలంగా ఉన్న మదిలోనే దేవుడి రూపు దర్శనమిస్తుందని పరమహంస ప్రబోధించారు.
















