ఈనాడు, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.వెయ్యి కోట్లు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేయకుంటే 13 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ తదితర కళాశాలలు సమ్మె చేస్తాయని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఆరోజు నుంచి తరగతులు బంద్ చేస్తామని తెలిపింది. దసరాలోపు రూ.600 కోట్లు, దీపావళినాటికి మరో రూ.600 కోట్లు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఇటీవల సమాఖ్య నేతలతో చర్చలు జరిపి ప్రకటించారు. ఈ హామీ మేరకు ఇవ్వకపోవడంతో సమాఖ్య నేతలు బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సమాఖ్య ప్రధాన కార్యదర్శి కేఎస్ రవికుమార్, కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఇతర నేతలు సునీల్‌కుమార్, నాగయ్య చౌదరి తదితరులతో కలిసి ఛైర్మన్ డాక్టర్ ఎన్.రమేష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
‘‘దసరాలోపు రూ.600 కోట్లు ఇస్తామని చెప్పి రూ.200 కోట్లే ఇచ్చారు. ఆ కొద్దిగానైనా ఇచ్చినందుకు బాధతోనే కృతజ్ఞతలు చెబుతున్నాం. మొత్తం రూ.1,200 కోట్లలో మిగిలిన రూ.వెయ్యి కోట్లను ఈ నెల 12లోపు విడుదల చేయాలి. లేకుంటే సమ్మెకు దిగుతాం. ప్రభుత్వానికి విద్యారంగం చివరి ప్రాధాన్యంగా ఉన్నట్లు అర్థమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం తిరిగాం. కాబూలీవాలాల మాదిరిగా వదిలిపెట్టడం లేదంటూ అవమానించినా దిగుమింగుకున్నాం. బకాయిల చెల్లింపుపై ఒక్కోశాఖ ఒక్కో రకంగా చెబుతోంది. ఇకపై సీఎం కార్యాలయంతో తప్ప మిగిలిన శాఖల అధికారులతో బకాయిలపై చర్చించేది లేదు. ఈ నెల 13 నుంచి 18 వరకు నిరసన, సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తాం. ఒక్కోరోజు ఒక్కో రూపంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి నిరసన పోరాటాలు చేస్తాం. 2,500 కళాశాలల యాజమాన్యాలతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేస్తాం.
దానికి సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానిస్తాం.. ఆయన హాజరై బకాయిల చెల్లింపుపై స్పష్టతనివ్వాలి. ఈ విద్యాసంవత్సరంతో కలుపుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మొత్తం రూ.10 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అందులో సగం గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలోనివే. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బును మీరే తెచ్చుకోండని ప్రభుత్వశాఖలకు విద్యార్థులను పంపించాలన్న ఆలోచన కూడా ఉంది. అవసరమైతే విద్యార్థులతో కలిసి ‘చలో హైదరాబాద్’ చేపడతాం’’ అని పేర్కొన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ సమ్మెలో భాగంగా కార్యాలయాల ముట్టడి, రాస్తారోకోలు, రైల్‌రోకోలు, బంద్‌లు లాంటివి ఏవైనా ఉండొచ్చని చెప్పారు. సమావేశంలో సమాఖ్య నేతలు కె.రాందాస్, అల్జాపూర్ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


















