దత్తి: ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదికలో గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘మానవత్వంతో ఆలోచించి పింఛన్ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నా. అందులో భాగంగా ఈ రోజు మీ గ్రామానికి వచ్చా. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రూ.500 మాత్రమే పింఛను ఇస్తున్నారు. వందలో 13 మందికి పింఛను ఇస్తున్నాం. అందులో 59 శాతం మహిళలకే అందిస్తున్నాం. ఒక్క పింఛన్‌తో మాత్రమే సరిపెట్టలేదు. సూపర్ సిక్స్ … సూపర్ హిట్ చేశాం. అన్ని పథకాలు అమలు చేశాం. ఆడబిడ్డలు కష్టపడకూడదని …ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఈనాడు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు పథకం ప్రారంభించిన 45 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వం. డ్వాక్రా రుణాలు తీసుకున్న ఆడ బిడ్డలు తిరిగి కడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్లు తీసుకున్న రుణాలు కట్టలేదు గానీ.. ఆడబిడ్డలు మాత్రం తిరిగి చెల్లిస్తున్నారు.
ఆదాయాన్ని పెంచడం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు ఆదాయం పెరగాలి. ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. ఆహారపు అలవాటలు మారాలి. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. తగినంత సాగునీరు లేదు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. ఇప్పటికే రైతు భరోసా ఒక్కో రైతుకు రూ.6వేలు వేశాం. ఇంకా రూ.14 వేలు వేస్తాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించాం. యువతకు అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చాం. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి’’ అని సీఎం వివరించారు.




















