అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్ల పిలుపు అంశంపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చ జరిగింది. రాజధానిలో అఖిలభారత సర్వీస్ అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపై కూడా సమీక్ష జరగనుంది. ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరు విషయాన్ని కూడా అథారిటీ సమీక్షించింది. అలాగే, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన యోగా, నేచురోపతి సెంటర్ నిర్మాణం, పలు భూ కేటాయింపులపై మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాల సమీక్ష కూడా జరిగింది. అమరావతిలో పంపింగ్ స్టేషన్లు, జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించి ఆమోదం ఇవ్వనుంది. జరీబు-మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు అథారిటీ ప్రకటించింది. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.



















