2025 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఓ పదం కాదు, ఒక సంఖ్యే నిలిచింది! ప్రముఖ ఆన్‌లైన్ నిఘంటువు డిక్షనరీ.కామ్ (Dictionary.com) ఈ ఏడాది “67”ను వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ఈ సంఖ్య ప్రస్తుతం జెన్ ఆల్ఫా (Gen Alpha) తరగతిలో విపరీతంగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2010 తర్వాత జన్మించిన పిల్లలు ఈ పదాన్ని తమ రోజువారీ మాటల్లో భాగం చేసుకున్నారు. అయితే 30 ఏళ్ల పైబడినవారికి మాత్రం ఇది ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
🔹 ‘67’ అంటే ఏమిటి?
దీనిని “సిక్స్ సెవెన్” అని చదవాలి. ఆసక్తికరంగా, దీనికి ఖచ్చితమైన అర్థం లేదని డిక్షనరీ.కామ్ చెబుతోంది. “ఇది అర్థం లేని మాటే అయినా, జెన్ ఆల్ఫా తమ వ్యక్తీకరణలో విపరీతంగా వాడుతున్నారు” అని వారు పేర్కొన్నారు. ఇది రెండు చేతులతో చేసే ఒక సంజ్ఞ ఆధారంగా కూడా ఉపయోగిస్తారని తెలిపారు.
ఈ పదం అమెరికా ర్యాపర్ స్క్రిల్లా పాడిన “Doot Doot (6 7)” అనే డ్రిల్ సాంగ్ నుంచి పుట్టిందని భావిస్తున్నారు. ఆ పాటలో ‘67’ పదం హుక్‌లా పదేపదే వినిపించడం వల్ల ఈ నంబర్ పాప్యులర్ అయింది.
🔹 స్కూల్స్‌లోనూ హడావుడి
ఇప్పుడు ఈ ‘67’ పదం స్కూల్స్‌లోనూ కలకలం రేపుతోంది. “మా విద్యార్థులు ఈ పదం వాడకుండా ఎలా ఆపాలి?” అంటూ టీచర్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ క్రేజ్ తగ్గేలా కనిపించడం లేదు.
🔹 ఇతర పదాలపై గెలిచిన ‘67’
ఈ నంబర్ “ఆరాఫార్మింగ్”, “బ్రోలిగార్కీ”, “ట్రాడ్‌వైఫ్”, “టారిఫ్”, “ఓవర్‌టూరిజం” వంటి పదాలను వెనక్కి నెట్టి వర్డ్ ఆఫ్ ది ఇయర్ బిరుదు దక్కించుకుంది. దీంతోపాటు నెటిజన్లు సరదాగా “ఇక వచ్చే ఏడాది ఎమోజీనే వర్డ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందేమో!” అని కామెంట్లు చేస్తున్నారు.
🌀 ఒకప్పుడు పదాలే ఆధిపత్యం చెలాయించగా… ఇప్పుడు నంబర్లు, మీమ్స్, ఎమోజీలు భాషలో కొత్త దిశ చూపుతున్నాయి!




















