రికార్డు స్థాయిలో ప్రయాణాలు
సోమవారాలు,సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీ
ఇప్పటికి రూ.350 కోట్ల రాయితీ వినియోగం- అమరావతి
రాష్ట్రంలో మహిళలు స్త్రీశక్తి పథకాన్ని ఉత్సాహంతో వినియోగించుకుంటున్నారు. ఐదు రకాల బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో.. వీటిలో రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో 90 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) ఉంటుందని అంచనా వేయగా.. దీనిని దాటి కొన్ని రోజులు 100 శాతానికిపైగా నమోదవుతోంది. అంటే ఆ బస్సుల్లో సీట్లన్నీ నిండి వెళ్తున్నాయి. కొన్నిరూట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో అప్పటికప్పుడు అదనపు సర్వీసులు నడుపుతున్నారు.
సెప్టెంబరు 27న 108 శాతం ఓఆర్
- సెప్టెంబరు 27న రికార్డుస్థాయిలో 27.83 లక్షల మంది మహిళలు ప్రయాణించారు.
- ఆరోజు స్త్రీశక్తి పథకం అమల్లో ఉన్న బస్సుల్లో 108 శాతం ఓఆర్ నమోదైంది.
- అలాగే సెప్టెంబరు ఒకటిన 101 శాతం, 24న 100 శాతం, 25న 103 శాతం ఓఆర్ వచ్చింది.
- సాధారణంగా బస్సుల్లో 40 సీట్లు ఉంటాయి. ఇవన్నీ నిండిపోయినా, ఇంకా నిల్చొని ప్రయాణిస్తున్నారు.
- గత వారం రోజులుగా నిత్యం సగటున 24-25 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు.
- సెప్టెంబరు నెల మొత్తం చూస్తే.. ఐదు రకాల బస్సుల్లో సగటున 91 శాతం ఓఆర్ నమోదైంది.
- గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారిలో పురుషులు 60 శాతం, మహిళలు 40 శాతం వరకు ఉండేవారు. ఇప్పుడు మహిళా ప్రయాణికుల సంఖ్య సగటున 63 శాతానికి చేరింది. పురుషులు 37 శాతానికి తగ్గారు.
9.63 కోట్ల స్త్రీశక్తి ప్రయాణాలు
ఆగస్టు 15న స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా, అప్పటి నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు దీనిని వినియోగించుకొని 9.63 కోట్ల మంది ప్రయాణించారు. ఆగస్టు నెలలో తొలి 15 రోజులు 3.03 కోట్ల మంది ఈ పథకాన్ని వినియోగించుకోగా, సెప్టెంబరులో 6.60 కోట్ల మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు.
ఐదు రకాల బస్సుల్లో జీరో ఫేర్ టికెట్లను జారీచేస్తున్నారు. ప్రయాణానికైన ఛార్జీని.. ఆయా మహిళలకు ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. ఆ సొమ్మును ప్రభుత్వం, ఆర్టీసీకి చెల్లిస్తుంది. ఇలా ఇప్పటి వరకు ఆర్టీసీ రూ.350.32 కోట్ల మేర స్త్రీశక్తి పథకం టికెట్లను జారీచేసింది. ఇందులో ఆగస్టుకు సంబంధించి రూ.115.74 కోట్లుకాగా, సెప్టెంబరుది రూ.234.58 కోట్లు.
పుణ్యక్షేత్రాలకు పోటెత్తుతున్నారు
- బస్సుల్లో సోమవారాలు అత్యధిక రద్దీ ఉంటోంది. మిగిలిన రోజుల్లో కూడా పుణ్యక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణికులు తరలివెళ్తున్నారు.
- ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారి సంఖ్య అత్యధికంగా ఉంది.
- నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి తరలి వచ్చినవారిలో స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకున్న మహిళలు ఎక్కువగా ఉన్నారు.
- విద్యా సంస్థలకు వరుసగా సెలవులు వచ్చినప్పుడు కూడా ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతోంది.
- ఉమ్మడి శ్రీకాకుళం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు నడిపే బస్సుల్లో సగటున 66 శాతం మహిళా ప్రయాణికులు ఉంటున్నారు.
- ఉమ్మడి గుంటూరు నుంచి నెల్లూరు వరకు 60 శాతం మహిళలు ప్రయాణిస్తుండగా, రాయలసీమ జిల్లాల్లో మాత్రం 49-50 శాతం మహిళలే రాకపోకలు సాగిస్తున్నారు.
- విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నడిపే మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో సగటున 117 శాతం ఓఆర్ ఉంటోంది.


















