బిట్రగుంట, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దేశంలోనే అతిపెద్దదిగా రూపుదిద్దుకోబోతోందని మత్స్య, వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. బుధవారం జువ్వలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్‌ను కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్‌తో కలిసి సందర్శించారు. మత్స్యకారుల సదస్సులో మాట్లాడుతూ.. ఫిషింగ్ హార్బర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయి వినియోగంలోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హార్బర్‌ను సందర్శించి మత్స్యకారులకు భరోసా ఇవ్వనున్నారన్నారు. త్వరలో కమిటీ ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతలు మత్స్యకార సంఘాలకు ఇవ్వాలా? ప్రైవేటు సంస్థలకు అప్పగించాలా? అనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏటా హార్బర్ నుంచి 41,250 టన్నుల మత్స్య సంపద సేకరించి రూ.825 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ పాలిశెట్టి, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి సత్యవాణి, జిల్లా మత్స్య శాఖ జేడీఏ శాంతి, కావలి గ్రామీణ సీఐ పాపారావు పాల్గొన్నారు.



















