న్యూ ఢిల్లీ: మద్యం అక్రమ రవాణా కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జేబీ పార్ధివాల, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన — “బెయిల్ రద్దు పిటిషన్లు తేలేవరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారించవద్దు” — అనే ఆదేశాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, “ఈ కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ పిటిషన్లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వేయిటింగ్ చేయాలన్న హైకోర్టు ఆదేశం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘన” అని స్పష్టం చేసింది.
అలాగే సుప్రీం కోర్టు హైకోర్టును ఉద్దేశించి, “బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లు మెరిట్ ఆధారంగా నిర్ణయించాలి. ఇలాంటి అంశాల్లో ఆలస్యం న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది” అని వ్యాఖ్యానించింది.




















