పర్చూరు: మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు భారీ నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఆయన పర్యటించారు. అన్నంబొట్లవారిపాలెం, పర్చూరు పరిసర ప్రాంతాల్లో పొంగిపోతున్న వాగులను, నీటమునిగిన పొలాలను పరిశీలించారు.
ఇళ్లలో నిల్వ ఉంచిన పొగాకు మండెలను స్వయంగా పరిశీలించిన మంత్రి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లా వరకు వాగుల ఉద్ధృతి కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరిగింది అని తెలిపారు. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
“నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని మంత్రి హామీ ఇచ్చారు. అదనంగా, తుఫాన్ వల్ల కూలిపోయిన విద్యుత్ స్తంభాలను 24 గంటల్లో పునరుద్ధరించామని, సాయంత్రంలోగా వ్యవసాయ కనెక్షన్లను కూడా తిరిగి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ఈ పర్యటనలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.



















