ముజఫ్ఫర్‌పుర్: బిహార్‌లో ఎన్నికల జోష్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముజఫ్ఫర్‌పుర్‌లో నిర్వహించిన భారీ ప్రజాసభలో ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే “జంగిల్ రాజ్” తప్పదని ఆయన హెచ్చరించారు.
మోదీ మాట్లాడుతూ, “ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనను ఐదు పదాలతో చెప్పవచ్చు – కట్టా (తుపాకీ), క్రూరతా (హింస), కటుత (ద్వేషం), కుశాసన (చెడు పాలన), కరప్షన్ (అవినీతి). ఈ ఐదు ‘K’ లే వారి పాలనా చిహ్నాలు,” అన్నారు. ఆయుధం ఉన్నచోట హింస తప్పదని, వారి పాలనలో బిహార్‌లో దోపిడీ, కిడ్నాప్‌లు విపరీతంగా పెరిగాయని గుర్తుచేశారు.
తనయుల కోసం సోనియా, లాలూ చేసే రాజకీయ ప్రయత్నాలు బిహార్ ప్రజలు గమనిస్తున్నారని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలది నూనె–నీటి బంధం. వారు కలిసి చేసే ర్యాలీలు ప్రజలను మోసం చేయడానికి మాత్రమే,” అన్నారు.
ఇక ఛఠ్ పూజను అవమానించడం కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు చేసిన అతిపెద్ద తప్పిదమని ఆయన విమర్శించారు. “ఛఠ్ పూజ బిహార్ గౌరవం, సంస్కృతి ప్రతీక. దాన్ని అవమానించిన వారిని బిహార్ తల్లులు ఎప్పటికీ క్షమించవు,” అన్నారు. ఛఠ్ పూజకు యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు.




















