తామర గింజలను ‘మఖానా’గా పిలుస్తారు. ఈ గింజలు అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు వీటిని పచ్చిగా తింటారు, మరికొందరు వేయించి, ఉడకబెట్టి లేదా కూరల్లో, స్వీట్లలో ఉపయోగిస్తారు. ఏ రూపంలో తీసుకున్నా, మఖానా ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు విశేషమే.
బరువు తగ్గించడంలో తోడు
మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవి బరువు తగ్గించాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలోని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో ఆహార కోరికలు తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది.
ఆరోగ్యానికి రక్షణగా మఖానా
⚛ మఖానాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని పలు రకాల వ్యాధుల నుంచి కాపాడుతాయి.
⚛ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
⚛ క్యాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు బలపడతాయి; ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.
⚛ పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
⚛ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.




















