ఈనాడు, హైదరాబాద్: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్/ టెలీ మార్కెటింగ్ కాల్స్‌ను నిరోధించేందుకు.. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత అసిస్టెంట్ ఈక్వల్ ఏఐని అభివృద్ధి చేసినట్లు హైదరాబాద్ సంస్థ ఈక్వల్ వెల్లడించింది. అక్టోబరు 2న ఇది అందుబాటులోకి రానుంది. ముందుగా దిల్లీలోని 10,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు దీన్ని అందిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు కేశవ్ రెడ్డి తెలిపారు. ఈక్వల్ ఏఐ మీ తరఫున కాల్ స్వీకరించి.. కాలర్‌ను, కాల్ అవసరాన్ని గుర్తించేందుకు ముందుగా మాట్లాడుతుంది. ఆపైన కాల్‌ను మనకు కనెక్ట్ చేయడం లేదా సందేశాన్ని నోట్ చేసుకోవడంలాంటి పనులు చేస్తుందని పేర్కొన్నారు. వినియోగదారు తనకు వచ్చిన కాల్ గురించి ఏం చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవచ్చని పేర్కొన్నారు. 2026 మధ్యకల్లా రోజువారీగా 10 లక్షల మంది యాక్టివ్ యూజర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.




















