ఈ ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం ఎక్కువగా పెరగడం వల్ల చాలామంది ప్రశాంతంగా నిద్రపోకపోతున్నారు. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం పాడవుతుంది. అయితే కొన్ని సరళమైన అలవాట్లను రోజువారీ జీవితంలో చేర్చడం ద్వారా సుఖ నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సమయపాలన ముఖ్యం:
చాలామంది బిజీ షెడ్యూల్ వల్ల నిద్ర సమయాన్ని పట్టించుకోరు. సుఖ నిద్ర కోసం రోజూ ఒక స్థిరమైన సమయానికి నిద్రపోవడం, లేచే సమయాన్ని కూడా క్రమబద్ధం చేయడం అవసరం. ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగుపడతుందని, వయసును కూడా సక్రమంగా నడిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గోరువెచ్చటి నీటితో స్నానం:
పలుమంది పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తారు. అందులో కొన్ని వేప ఆకులు, లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ కలుపుకోవడం ద్వారా చర్మం ప్రశాంతంగా మారుతుంది వేప ఆకులు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ ఇస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
నెయ్యితో మర్దన:
గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలున్నవారు రాత్రి సుఖంగా నిద్రపోలేరు. అప్పుడు నెయ్యితో మర్దన చేస్తే నిద్రలేమి సమస్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. అలసట, ఆందోళన తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఇతర జాగ్రత్తలు:
- రాత్రి భోజనం మరియు నిద్ర మధ్య కనీసం 2–3 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.
- నిద్రకు 60 నిమిషాల ముందు గ్యాడ్జెట్లు పక్కన పెట్టాలి.
- నిద్రపోయే గది చల్లగా, సరైన వెంటిలేషన్‌తో, చీకటిగా ఉండేలా చూడాలి. ఇష్టపడే వారు తక్కువ వెలుతురు వచ్చే లైట్ ఏర్పాటు చేసుకోవచ్చు.
- పడుకునే ముందు ధ్యానం చేస్తే మైండ్ ప్రశాంతమవుతుంది.
ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే సుఖనిద్రకు మార్గం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.




















