రష్యాలో భారతీయ వైద్య విద్యార్థి అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. దాదాపు మూడు వారాలుగా అదృశ్యమైన ఆ విద్యార్థి శవం తాజాగా ఓ డ్యామ్‌లో తేలింది. మృతుడిని రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల అజిత్ సింగ్ చౌధరీగా గుర్తించారు.
2023లో వైద్య విద్య కోసం రష్యాకు వెళ్లిన అజిత్, యుఫా నగరంలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అక్టోబర్ 10న ఉదయం పాలు కొనేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొన్ని రోజుల తరువాత వైట్ నది సమీపంలో అతని దుస్తులు, ఫోన్, షూ లభించడంతో స్థానిక అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
దీనిలో భాగంగా, గురువారం నదిపై ఉన్న డ్యామ్‌లో ఒక మృతదేహాన్ని గుర్తించగా, అది అజిత్‌దేనని తోటి విద్యార్థులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత రాయబార కార్యాలయం అజిత్ కుటుంబానికి మరియు రాజస్థాన్ అధికారులకు వివరాలు అందించింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నారు.
అజిత్ మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, ఘటన అనుమానాస్పదంగా ఉందని, కేంద్ర విదేశాంగశాఖ ద్వారా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.




















