అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయగల శక్తి అమెరికాకు ఉందని తెలిపారు. ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్‌లో మాట్లాడిన ట్రంప్, అణు నిరాయుధీకరణ ఒక గొప్ప విషయం అని పేర్కొన్నారు.
“మేం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలం, కానీ ఆ అవసరం లేదు.అందరూ తమ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ప్రజలకు ప్రయోజనం కలిగించే ఇతర అంశాలపై ఖర్చు చేయాలని అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను. దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు గతంలో జరిగాయి, ప్రస్తుతం అలాంటివి లేవు,” అని ట్రంప్ పేర్కొన్నారు.
అణు నిరాయుధీకరణ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో చర్చించినట్లు కూడా ఆయన వెల్లడించారు.
అంతేకాక, త్వరలో భారత పర్యటనకు రావాలనే ఆలోచనలో ఉన్నానని ట్రంప్ తెలిపారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అమెరికా అణ్వాయుధ పరీక్షలకు సిద్ధమవుతోందని ఇటీవల ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాలు — ముఖ్యంగా పాకిస్థాన్ కూడా — అణ్వాయుధ పరీక్షలు జరుపుతున్నాయని అన్నారు.
“రష్యా, చైనా వద్ద విస్తృతమైన అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అమెరికా వద్ద వాటికంటే ఎక్కువ శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయి. కానీ మేం వాటిని ఉపయోగించాలనుకోవడం లేదు, శాంతి కోసం కృషి చేస్తున్నాం,” అని ట్రంప్ స్పష్టం చేశారు.




















