పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ “జాతికి అంకితం చేశాన”ని చెప్పి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడువిమర్శించారు. ఇటీవల మొంథా తుపాను వల్ల నష్టపోయిన వెలిగొండ ఫీడర్ కెనాల్‌ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. జంట సొరంగాల్లోకి చేరిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించగా, భవిష్యత్తులో వరదలను దృష్టిలో ఉంచుకుని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ డిజైన్‌లకు ఆమోదం ఇవ్వాలని సూచించారు.
ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు, కాంట్రాక్టర్ సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.
నిమ్మల మాట్లాడుతూ, “పూర్తికాని వెలిగొండను పూర్తిచేశానని జగన్ చెప్పడం ప్రపంచంలోని ఎనిమిదో వింత. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.900 కోట్ల పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదు. ఆగిపోయిన ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం టన్నెల్-2లో 4.2 కి.మీ లైనింగ్, బెంచింగ్ పనులు, అలాగే టీబీఎం యంత్రం తొలగింపు మిగిలి ఉన్నాయి. ఫీడర్ కెనాల్ లైనింగ్ మరియు 3 కి.మీ పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్లతో టెండర్లు పిలిచాం. ఈ నెలలోనే ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభమవుతాయి. టన్నెల్-2లో టీబీఎం యంత్రం తొలగించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాం. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి రైతులకు నీరందించడమే మా లక్ష్యం’’ అన్నారు.




















