విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్) భవనం ముందు ఎగురుతున్న ఈ జెండాల వెనుక ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉంది. కోకోవెన్, ఆర్‌ఎంహెచ్‌పి, బ్లాస్ట్ ఫర్నేస్, సింటర్ ప్లాంట్, ఎస్‌ఎంఎస్-1, ఎస్‌ఎంఎస్-2, సీఆర్‌ఎంపి, మిల్స్, థర్మల్ పవర్ ప్లాంట్ వంటి తొమ్మిది విభాగాలను ఈ జెండాలు సూచిస్తాయి. ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఒక రంగు జెండా కేటాయించారు. ఆ రోజు అత్యుత్తమ ఉత్పత్తి లేదా పనితీరు కనబరిచిన విభాగం జెండాను మరుసటి రోజు మిగతా వాటికంటే ఎత్తుగా ఎగురవేస్తారు. లక్ష్యాలను చేరుకోలేని విభాగాల జెండాలను తక్కువ ఎత్తులో ఉంచుతారు. ఉద్యోగుల్లో స్ఫూర్తిని పెంపొందించడం, పోటీ భావనను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ చిత్రంలో ఆర్‌ఎంహెచ్‌పి మరియు మిల్స్ విభాగాల జెండాలు ఎత్తుగా ఎగురుతుండటం గమనించవచ్చు.




















