తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండటంతో జనజీవనం ప్రభావితమవుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వాయుగుండం ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం-పోలాకి మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అయితే దాని ప్రభావంతో మరో 12 గంటలపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు మరో 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలతో వంశధార, నాగావళి, బాహుదా నదుల్లోకి వరదనీరు చేరుతోంది. పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం. వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
విజయనగరం జిల్లాలోని తెర్లాం, బాడంగి, డెంకాడ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షం నిరంతరంగా కురుస్తోంది. గంగవరం-పెదగంట్యాడ మార్గంలో రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధురవాడ కొమ్మాది హౌసింగ్ బోర్డు కాలనీలోని రేకాన్ టవర్స్ సెల్లార్‌లోకి వర్షపు నీరు చేరింది. అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న గడ్డకు సంబంధించిన రక్షణ గోడ కూలిపోవడంతో మురుగు, వర్షపు నీరు సెల్లార్‌లోకి ప్రవేశించింది.
సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రాత్రి ఒంటిగంట సమయంలో అక్కడికి చేరుకుని అపార్ట్‌మెంట్‌లోని 15 కుటుంబాలకు చెందిన 71 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సెల్లార్‌లో ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కుటుంబాలు ప్రస్తుతం బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
మరోవైపు హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతం కూడా నీటమునిగింది. కార్పెంటర్ కాలనీ కొండవాలు ప్రాంతంలో వర్షానికి ఓ రేకుల షెడ్ కూలింది. ఘటన సమయంలో లోపల నిద్రిస్తున్న మెట్ట రాము కుటుంబం స్వల్ప ప్రమాదం నుంచి బయటపడింది. అగనంపూడి హైవేపై భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో కాంచనతో పాటు ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.
వేపగుంట పరిధిలోని గ్యాస్ గోడౌన్ వెనుక, కృష్ణానగర్ ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలపై పడటంతో బుధవారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయాన్నే ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది రంగంలోకి దిగి చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
అనకాపల్లి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరదనీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లాలోని వినగడప వద్ద కట్టలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు రహదారిపైకి చేరడంతో సుమారు 20 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















