నల్గొండ అర్బన్ ప్రాంతంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రేరేపించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని సంస్థ అధ్యక్షురాలు కవిత తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు.
ఆసుపత్రుల్లో సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అవసరమైన వసతులు లేకపోవడం విచారకరమని ఆమె అన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి పెద్ద నాయకులు ఉన్నప్పటికీ, నల్గొండ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను చించివేయడం తగిన చర్య కాదని కవిత పేర్కొన్నారు.
జాగృతి సంస్థతో అనుసంధానం కలిగిన వారిని ఇబ్బందులకు గురిచేయాలనే ప్రయత్నాలు చేస్తే సహించబోమని ఆమె హెచ్చరించారు. జిల్లాలో ప్రతిపక్షం బలహీనంగా ఉండటంతో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా జాగృతిపై విమర్శలకే పరిమితమవుతున్నారని కవిత వ్యాఖ్యానించారు.




















