ఇంటర్నెట్ డెస్క్: ప్రిస్క్రిప్షన్ ఔషధాలను వినియోగదారులకు డిస్కౌంట్ ధరల్లో అందజేయడానికి అమెరికా ప్రభుత్వం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అమెరికా బహుళజాతి ఔషధ, బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చౌక ఔషధాల కోసం అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రిస్క్రిప్షన్ ఔషధాలను వినియోగదారులకు డిస్కౌంట్ ధరల్లో ఫైజర్ సంస్థ అందజేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఆరోగ్యంపై ఖర్చు తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ విధానాన్ని త్వరలో అమలుచేస్తామని స్పష్టంచేశారు.
ప్రిస్క్రిప్షన్ ఔషధాలను డిస్కౌంట్ ధరల్లో ఇవ్వడానికి త్వరలో మరిన్ని ఔషధ తయారీ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, స్విట్జర్లాండ్, డెన్మార్క్ వంటి అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో ఉన్న ఔషధాల ధరలతో అమెరికాలో లభించే మందుల ధరలను సమం చేయడానికే ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ నినాదంతో 2026 ప్రారంభంలో ఈ వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ట్రంప్‌ఆర్‌ఎక్స్ సైట్ నేరుగా మందులు విక్రయించదని.. వినియోగదారుల ప్రిస్క్రిప్షన్‌లను ఔషధ తయారీదారుల డైరెక్ట్-టు-కన్స్యూమర్ ప్లాట్‌ఫామ్‌లకు మళ్లిస్తుందన్నారు.
ఫైజర్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్‌ఆర్‌ఎక్స్ వెబ్‌సైట్‌లో ఔషధాల ధరలు నేరుగా బయట కొనుగోలు చేసేవాటికంటే 50 శాతం తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఫైజర్ ప్రాథమిక ఔషధాలను ట్రంప్‌ఆర్‌ఎక్స్ ద్వారా అందిస్తుందని పేర్కొన్నప్పటికీ.. అవి ఏ మందులు అనే విషయం గురించి మాత్రం స్పష్టతనివ్వలేదు. అయితే ట్రంప్ ఆలోచన అమల్లోకి వస్తే భారత్‌తో సహా పలు దేశాల్లో మందుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ విధానాన్ని ట్రంప్ ముందుకుతీసుకువెళ్లే క్రమంలో అమెరికాలో మందుల ధరలు తగ్గుతాయని, తత్ఫలితంగా అక్కడ తగ్గిన ఆదాయాలను ఇతర దేశాల్లో భర్తీ చేసుకునేందుకు ఫార్మా కంపెనీలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్నారు




















