అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ ‘ఎస్కపేడ్’ విజయవంతంగా ప్రారంభమైంది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆర్జిన్’ నిర్మించిన జంబో రాకెట్ నింగిలో అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రవేశపెట్టింది. రాకెట్ తర్వాత భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. వాతావరణ సమస్యలు, సౌర తుపానుల కారణంగా కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ‘ఎస్కపేడ్’ మిషన్ గురువారం ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవెరల్ స్పేస్ స్టేషన్ నుంచి అతి శక్తివంతమైన ‘న్యూ గ్లెన్’ రాకెట్‌తో అంగారకుడి దిశగా బయలుదేరింది. 321 అడుగుల ఎత్తుతో, ‘న్యూ గ్లెన్’ రాకెట్ రోబోటిక్ మార్స్ సైన్స్, భారీ వాణిజ్య రాకెట్ల పరిణామంలో కొత్త శకాన్ని ప్రారంభించింది.
ఒకే మిషన్‌లో రెండు ఉపగ్రహాలు
‘ఎస్కపేడ్’ మిషన్‌లో రెండు ఉపగ్రహాలు – బ్లూ మరియు గోల్డ్ – భాగంగా ఉన్నాయి. ఇవి అంగారక వాతావరణాన్ని, ఆ గ్రహం ఎలా తన వాతావరణాన్ని కోల్పోయిందో పరిశీలిస్తాయి. మార్స్ పరిణామం, నివాసయోగ్యత, అయస్కాంత క్షేత్రం, ప్లాస్మా వాతావరణం వంటి అంశాలను ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేసి, బిలియన్ల ఏళ్ల నిగూఢమైన డేటాను సేకరిస్తాయి. ‘ఎస్కపేడ్’ వాహనం భూకక్షలో ఒక సంవత్సరం తిరిగి, 2027లో అంగారకుడి కక్షలోకి ప్రవేశిస్తుంది. కక్షలో చేరిన వెంటనే బ్లూ, గోల్డ్ ఉపగ్రహాలు పరిశోధన మొదలుపెడతాయి.
బ్లూ ఆర్జిన్ స్పేస్ ఎక్స్‌కు పోటీగా
ప్రయోగం తర్వాత జంబో రాకెట్ ‘న్యూ గ్లెన్’ భూమికి తిరిగి సురక్షితంగా దిగింది. ఇది బ్లూ ఆర్జిన్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇప్పటివరకు రీయూజబుల్ రాకెట్ సాంకేతికతలో స్పేస్ ఎక్స్ మాత్రమే ముందంజలో ఉండగా, బ్లూ ఆర్జిన్ కూడా ఇప్పుడు ఆ మార్క్‌ను సాధించింది. దీంతో స్పేస్ ఎక్స్‌కు బ్లూ ఆర్జిన్ పోటీగా మారింది.




















