విశాఖపట్నం: మానవరహిత సముద్ర వ్యవస్థలు, ఆటోనమస్ వెసల్స్, రక్షణ సంబంధిత ఆధునిక పరిష్కారాల్లో ప్రముఖమైన సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
2015లో స్థాపించబడిన ఈ సంస్థ సముద్ర భద్రత, నిఘా, పర్యావరణ సంరక్షణ కోసం అధునాతన ప్లాట్‌ఫారమ్‌లు డిజైన్ చేసి తయారు చేస్తోంది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, భారత్‌ను మెరైన్ రోబోటిక్స్ మరియు డిఫెన్స్ ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచంలో ముందంజలో నిలపడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మెరైన్ రోబోటిక్స్, నావిగేషన్ వ్యవస్థలపై అనేక పేటెంట్లు తమదేనని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, 1057 కిలోమీటర్ల విస్తారమైన తీరరేఖ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక మెరైన్ పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఎఐ, ఐఓటి, స్వయంచాలక వ్యవస్థల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.




















