రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో, సంక్షోభంలోనే అవకాశాలు వెతుకుతూ ఆర్థిక వ్యవస్థను తిరిగి సరైన దారిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ కేవలం 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఆయన చెప్పారు. శుక్రవారం నోవోటెల్ హోటల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఏపీ రీ–ఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్సింగ్’ సదస్సులో సీఎం ప్రసంగించారు.
ఎస్క్రో ఖాతా – పెట్టుబడిదారులకు భరోసా
గత అయిదేళ్లలో రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతిన్నా, ఇప్పుడు కేంద్ర సహకారంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని సీఎం తెలిపారు. అనకాపల్లికి అర్సెలార్ మిత్తల్ వంటి భారీ ప్రాజెక్టు రావడం వల్ల పెట్టుబడులకు కొత్త దారులు తెరుచుకున్నాయని, గూగుల్ డేటా సెంటర్ కూడా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకు వస్తోందని వెల్లడించారు.
పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ విధానాల వల్ల ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే సావనీర్ గ్యారెంటీ కూడా ఇస్తామని స్పష్టం చేశారు.
సంస్కరణలే అభివృద్ధికి మార్గం
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, గతంలో చేపట్టిన సంస్కరణల వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని చంద్రబాబు గుర్తు చేశారు. 1999లో తీసుకున్న విద్యుత్ సంస్కరణల వల్ల ఇప్పుడు ఏపీలో విద్యుత్ వ్యవస్థ దృఢంగా నిలిచిందని అన్నారు. విభజన తర్వాత వ్యవసాయ, అగ్రి-అలైడ్ రంగాలు ఏపీకి, సర్వీసు రంగం తెలంగాణకు వెళ్లడంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు.



















