ఇంటర్నెట్‌డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య నలిగిపోతున్న గాజా ప్రజలు అత్యంత దయనీయపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిలువనీడ లేక తినడానికి తిండి దొరక్క మానవతాసహాయంపై ఆధారపడి బతుకీడ్చుతున్నారు. తమ పిల్లలకింత తిండిపెట్టాలని ఆరాటపడుతూ ఏదైనా ఉపాధి దొరుకుతుందేమోనని చూసే మహిళలకు మాత్రం దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. వారు లైంగిక దోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఆరుగురు పిల్లల ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలా అని ఎదురుచూస్తోన్న 38 ఏళ్ల మహిళకు ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తానని ఒక వ్యక్తి హామీ ఇచ్చాడు. అందుకు బదులుగా అతడు తనను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడని ఆమె మీడియాకు వెల్లడించింది. ‘‘అక్కడి నుంచి ఎప్పుడు బయటపడతానా అని అనుకున్నాను. తర్వాత అతడు 30 డాలర్లకు సమానమైన నగదు ఇచ్చాడు. కానీ ఎలాంటి ఉపాధి మాత్రం దొరకలేదు’’ అని వాపోయింది. ఇలా ఆరుగురు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆహారం, డబ్బు, ఉపాధి పేరిట వారు తమను లొంగదీసుకున్నారని చెప్పారు. కొంతమంది పెళ్లిపేరిట మాయమాటలు చెప్పారన్నారు
కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి దుర్భరపరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేంకాదని మానవతా సహాయం అందించే బృందాలు, మానవహక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. ఇలాంటి మానవతా సంక్షోభాలు ప్రజలను దుర్భలంగా మారుస్తాయని, వాటి పర్యవసానాల్లో లైంగిక హింస పెరగడం ఒకటని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి హీథర్ బార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక గాజా మహిళలు, బాలికల దయనీయ పరిస్థితిని వెల్లడించడానికి మాటలు కూడా రావడంలేదని విచారం వ్యక్తంచేశారు. సహాయం పొందేందుకు లైంగిక దోపిడీ గురైన మహిళలకు తాము చికిత్స అందించినట్లు పాలస్తీనాకు చెందిన సైకాలజిస్టులు వెల్లడించారు. వారిలో కొందరు గర్భం దాల్చారని చెప్పారు. ఇలాంటి ఘటనల గురించి తమకు తెలుసని ఐరాస సంస్థలలో కలిసి పనిచేస్తోన్న మానవ హక్కుల సంస్థలు అంగీకరించడం గమనార్హం.




















