బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపాలపై మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై తీర్పు ఈ నెల 17న (నవంబరు 17) విడుదలకానుందని తెలియడం తో ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు.
ఈ పరిణామాలపై హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ స్పందిస్తూ, తన తల్లి పై మరణశిక్ష విధించబడవచ్చేమో అని చెప్పారు. ఆయన పేర్కొన్నారు, “మా అమ్మపై నమోదైన కేసుల తీర్పు ముందుగానే ఊహించవచ్చును. తీర్పు ప్రత్యక్ష ప్రసారం కాకపోవడం ఖాయం. అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారు. బహుశా మరణశిక్షను విధించవచ్చు. అయినప్పటికీ వారు ఆమెకు ఏమి చేయగలరు? ఆమె భారత్‌లో సురక్షితంగా ఉంది” అని వాజేద్ పేర్కొన్నారు. అదనంగా, అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగితే, బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఆందోళనలు చెలరేగవచ్చని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలను కార్యకర్తలు అడ్డుకోవచ్చని హెచ్చరించారు. వాజేద్ ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివసిస్తున్నాడు.
ఇదే సమయంలో హసీనా కూడా తన కార్యకర్తలకు వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ, తనపై కేసులు చట్టవిరుద్ధమని తెలిపారు. “అవామీ లీగ్ పాలనలో నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకున్నాం. కానీ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరగాళ్లు హీరోలుగా మారుతున్నారు. నా పై నకిలీ కేసులు నమోదు చేయడం ద్వారా నా గళాన్ని అణచివేయలేరు” అని హసీనా చెప్పింది. ఈ కుట్రల వల్ల ఆమె స్వదేశం విడిచిపెట్టాల్సి వచ్చిన బాధను వివరించారు. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చినా దేశమంతా లాక్‌డౌన్ వాతావరణంలో ఉండేలా కార్యకర్తలకు సూచించారు.
గత ఏడాదిలో విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. ఇప్పటివరకు దిల్లీలోని రహస్య ప్రదేశంలో నివసిస్తూ, సోషల్ మీడియా ద్వారా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. గత ఏడాది జరిగిన హింసాత్మక అల్లర్లు అనేక ప్రాణ నష్టం కలిగించాయి. అందువల్ల హసీనాపై హత్య సహా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల తీర్పును ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం ప్రకటించనుంది.




















