ఇంటర్నెట్ డెస్క్: నిద్ర పోవడం కోసం రోజూ కష్టపడతానని అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ తెలిపారు. అతికష్టం మీద రోజుకు 4 గంటలు నిద్ర పోతానన్నారు. స్లీపింగ్ డిజార్డర్ ఉందని అందుకే తనకు నిద్ర రాదన్నారు. హీరోగా, ప్రొఫెషనల్ రేసర్‌గా రికార్డులు సృష్టించే అజిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడారు. అద్భుతాలు చేయడానికి సోషల్ మీడియా గొప్ప సాధనమన్నారు. దానినుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు.
‘‘అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా భారతీయ సినిమాలు, సిరీస్‌లు చూడడం ప్రారంభించాలని కోరుకుంటున్నా. కొరియన్ డ్రామాలు చూసి కొరియన్ నేర్చుకున్నట్లు నా స్నేహితులు చెప్పారు. నాకూ అలా చూడాలని ఉన్నప్పటికీ సమయం దొరకదు. పైగా నాకు స్లీపింగ్ డిజార్డర్ ఉంది అందువల్ల నిద్ర రావడం చాలా కష్టం. విరామ సమయంలో, ప్రయాణాలు చేసేటప్పుడు నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎంత కష్టపడినప్పటికీ రోజులో 4 గంటలకు మించి నిద్ర పోలేను’’ అని అజిత్ తెలిపారు.
ఇక రేసర్‌గా తన ప్రయాణం, ట్రాక్‌పై జరిగిన ప్రమాదాల గురించి ప్రస్తావించారు. ‘‘నాకు జరిగిన ప్రమాదాలపై వచ్చే ప్రతి వార్త చదువుతాను. ఈ రంగంలో ప్రమాదాలు జరగడం సహజం. రేసింగ్‌లో ఉన్న ఎవరిని అడిగినా గాయాలు అందులోభాగమనే చెబుతారు. ఈ కార్లను ప్రత్యేకంగా తయారుచేస్తారు. డ్రైవర్ భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు. అందుకే ప్రమాదాలు జరిగినా అవి తీవ్రతరం కావు. ప్రాణాలకు ప్రమాదం జరిగే పరిస్థితులు చాలా తక్కువ’’ అని చెప్పారు.




















