శబరిమలకు బయలుదేరిన సమయంలో “జగన్ 2.0” బ్యానర్లు ప్రదర్శించడంతో వివాదం చెలరేగింది. యాత్ర సందర్భంగా “జై జగన్” నినాదాలు వినిపించడం భక్తుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన కొందరు వైసీపీ నాయకుల ఈ ప్రవర్తనపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.శబరిమల యాత్ర ఆధ్యాత్మికత, నియమాచారం, భక్తి ప్రధానంగా జరిగే పవిత్రమైన పాదయాత్ర. ఇటువంటి సందర్భంలో రాజకీయ బ్యానర్లు, నినాదాలు ప్రదర్శించడం యాత్ర సాంప్రదాయాలకు విరుద్ధమని భక్తులు స్వరం ఎత్తుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో రాజకీయ ప్రచారం అవసరం లేనిదని, అధికారులకు ఇటువంటి చర్యలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.




















