ఎదుగుతున్నప్పుడు విన్న మాటలే తనని బలంగా మార్చాయని అంటోంది బాలీవుడ్ తార భూమి పెడ్నేకర్. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘భక్షక్’ లాంటి శక్తిమంతమైన కథల్ని ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న కథానాయికీమె. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘ది రాయల్స్’ సిరీస్‌తో ఓటీటీ వేదికగా సందడి చేసిన ఈమె.. ఎంచుకునే చిత్రాలే తనలోని మార్పుకు కారణమని చెప్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి.. తన సినీ ప్రయాణం, బాల్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.
‘‘చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. నేను యశ్ రాజ్ ఫిల్మ్ రూపొందించిన ‘దమ్ లగా కే హైసా’తో టీనేజర్‌గా ఉన్నప్పుడే సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. బాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్ కావాలని కలలు కన్నా. మొదట్లో గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూశా. కానీ నేడు నేను కోరుకున్నవన్నీ సాధించా. ఒక నటిగా చాలా అభివృద్ధి సాధించాను. నా తొలి సినిమా ప్రభావం, ఉనికిని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇదే నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ సమయంలోనే సినిమా చాలా శక్తిమంతమైన సాధనమని గ్రహించా. నా కళతో సినీప్రియుల్లో స్ఫూర్తి నింపాలనుకున్నా. అందుకే ‘భక్షక్’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ లాంటి కథల్ని ఎంపిక చేసుకున్నా. ఇవి మహిళ గౌరవం, జర్నలిజం లాంటి ఇతివృత్తాలను అన్వేషించాయి. ఈ పదేళ్లు ప్రతి క్షణం నా కల కోసం బతికాను. మరిన్ని వైవిధ్యమైన కథలతో నా చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’’.
అది నా వ్యక్తిగత నిర్ణయం
‘‘సినీ రంగంలోకి రావడం వల్ల జీవితంలో ఎన్నో కొత్త విషయాలు జరిగాయి. గత రెండేళ్లుగా నా కెరీర్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ధైర్యంగా, సినిమాను దాటి మాట్లాడే అవకాశం దొరికింది. నాకు ఇది చాలా పెద్ద మార్పు. తొలినాళ్లలో నా వృత్తి కారణంగా కొన్ని నియమాలను పాటించేదాన్ని. ఇప్పుడు ఎందుకో నేను ఫ్యాషన్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నా. ‘‘ఆమె ఎందుకు అంత కష్టపడుతోంది. ఆమె చాలా మంచి నటి. ఫ్యాషన్ గురించి ఎందుకు పట్టించుకోవాలి..’’ అంటూ ఈ మధ్య కొంత మంది సామాజిక మాధ్యమాల్లో నాపై కామెంట్లు చేస్తున్నారు. కానీ నేను ఎందుకు ఫ్యాషన్ గురించి పట్టించుకోకూడదు? ఏం చేయాలో, చేయకూడదో అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ఫ్యాషన్ అనేది నా ప్రతిభను ప్రపంచానికి చెప్పడానికి ఓ గొప్ప మార్గం. ఇటీవల సొంతంగా కొన్ని బ్రాండ్‌లను కూడా ప్రారంభించడంతో మరో కొత్త అధ్యాయానికి కూడా నాంది పలికాను’’.
ఎగతాళి, వెక్కిరింపులే ఎక్కువ
‘‘నన్ను ఎవరైనా నువ్వు ఇది చేయలేవు.. నీ వల్ల కాదు అంటే నన్ను నేను సవాలు చేసుకొని రంగంలోకి దిగుతా. బాల్యం నుంచి ఇలాంటి మాటలే వింటూ పెరిగా. చాలా సందర్భాల్లో నన్ను ‘ఏంటి ఆమె నటి అవుతుందా?’ అని ఎగతాళి చేసేవారు. వెక్కిరించేవారు. కానీ అవేమీ నాపై ప్రభావం చూపించలేదు. అనుకున్నట్లుగానే నేను ఒక అద్భుతమైన ఫిల్మ్ స్టూడియోలో కాస్టింగ్ విభాగంలో అడుగుపెట్టాను. అక్కడే ఎంతో కష్టపడి అన్నీ నేర్చుకున్నా. ఈ ప్రయాణంలో నాకు ఆ దేవుడే అండగా ఉన్నాడేమో అనిపిస్తుంది. ‘దమ్ లగా కే హైసా’ చిత్రంలో నటించడం నాకో గొప్ప అవకాశం. నా కలలకు దారి చూపించిందీ సినిమా’’.
వీటిని పట్టించు కోకపోతేనే.. ప్రశాంతత
‘‘నటీనటులందరు సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవడం ఈరోజుల్లో సాధారణం అయిపోయింది. దీన్ని ట్రోలింగ్, బెదిరింపు.. ఇలా మీరు దానిని ఏ విధంగా పిలిచినా.. మనం దానికి అలవాటు పడ్డాం అనేది మాత్రం నిజం. కానీ మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికీ నాకు తెలియదు. ఈ విషయంలో ధైర్యంగా లేకపోయినా.. కచ్చితంగా వాటిని తట్టుకొని నిలబడగలనని తెలుసు. మనం సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎంతో మంది వారి అభిప్రాయాలను మనపై రుద్దుతుంటారు. వాటిని అంతగా పట్టించుకోకపోతేనే.. ప్రశాంతంగా ఉండొచ్చనేది నా అభిప్రాయం’’.




















