క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యంతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఆమె స్పష్టం చేశారు.
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా భువనేశ్వరి పరమ సముద్రం గ్రామాన్ని సందర్శించారు. కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల, గురుకుల పాఠశాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణించారు. అనంతరం సామగుట్టపల్లిలో జరిగిన ‘విలువల బడి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కస్తూర్భా పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారితో కలిసి భోజనం చేశారు.
“విజయానికి షార్ట్‌కట్ ఉండదు” – భువనేశ్వరి
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత అని ఆమె సూచించారు.
ఆటపాటలతో పాటు కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శ్రమిస్తేనే విజయం సాధ్యమవుతుందని భువనేశ్వరి అన్నారు.
ఎన్టీఆర్, అబ్దుల్ కలాం, ధీరూభాయ్ అంబానీ, చంద్రబాబు వంటి మహనీయులు అన్ని కష్టాలు తట్టుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నారని విద్యార్థులకు ఉదాహరణగా చెప్పారు.
చంద్రబాబు చిన్నతనంలో 6 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లేవారని, తాను కూడా తల్లిదండ్రుల ప్రేరణతోనే ఎదిగానని గుర్తుచేశారు.
స్థోమతకు మించి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించే వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కస్తూర్భా విద్యాలయానికి 20 కంప్యూటర్లు, నర్సింగ్ విద్యార్థులకు కావలసిన పరికరాలు అందజేస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.
విలువలతో పెరిగిన పిల్లలే మంచి పౌరులని భువనేశ్వరి
‘విలువల బడి’ స్థాపకుడు లెనిల్‌ను అభినందించిన భువనేశ్వరి, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతగలదని అన్నారు.
పాత రోజుల్లో స్కూళ్లలో ఉండే ‘మోరల్ సైన్స్’ సబ్జెక్ట్‌ను పాఠశాలల్లో తిరిగి ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ‘క్లోజ్’ బోర్డులు కనిపించడం సంతోషకరమని చెప్పారు.
నేటి కాలంలో టెక్నాలజీని తప్పుగా ఉపయోగించే పరిస్థితి పెరుగుతోందని, పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎంతో కీలకమని భువనేశ్వరి వివరించారు. చిన్నతనం నుంచే విలువలు, సంస్కారాలు నేర్పితేనే పిల్లలు సమాజానికి ఉపయోగపడే పౌరులవుతారని చెప్పారు.
లోకేష్ ప్రజాసేవతో బిజీగా ఉండటంతో మనుమడు దేవాన్ష్ చదువు, క్రీడల విషయాలు తన కోడలు బ్రాహ్మణి చూసుకుంటుందని, అలాగే అప్పట్లో చంద్రబాబు బిజీగా ఉన్నప్పుడు లోకేష్ పెంపక బాధ్యతను తానే తీసుకున్నానని భువనేశ్వరి గుర్తుచేశారు.





































