రాష్ట్రాన్ని మూడు ప్రధాన ఆర్థిక విభాగాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్). ఈ మూడు ప్రణాళికలను సమగ్రంగా రూపొందించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌లో సవివరంగా చేర్చనున్నారు. ఇందులో యువత, మహిళలు, రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచి, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచే విధానంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
క్యూర్ (Core Urban Region Economy)
హైదరాబాద్ నగరంలోని ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్‌గా అభివృద్ధి చేస్తారు. గతంలో వివిధ మున్సిపాలిటీ, పంచాయతీ వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్యలు ఎదురైయ్యాయి. ట్రాఫిక్, వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ ఆధారంగా అభివృద్ధి చేస్తారు. కాలుష్యాన్ని తగ్గించడం, చెరువులు, కుంటలు, నాళాలను శుభ్రం చేయడం, మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్స్, కాలుష్య పరిశ్రమల తొలగింపు వంటి ప్రణాళికలు చేపడతారు.
రేర్ (Rural Agriculture Region Economy)
రిజినల్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలను రూరల్ అగ్రికల్చర్ రీజియన్‌గా అభివృద్ధి చేస్తారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఆర్గానిక్ ఫుడ్స్, అగ్రికల్చర్ పార్కులు, పండ్లు, కూరగాయల పరిశ్రమలను నెలకొల్పి గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆర్థిక వృద్ధిలో భాగస్వాములుగా మార్చడం లక్ష్యం.
ప్యూర్ (Peri Urban Region Economy)
ఓఆర్‌ఆర్ వెలుపల రీజినల్ రింగ్ రోడ్ పరిధిని పెరి అర్బన్ రీజియన్‌గా తీసుకొని మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌గా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి-సీతారాంపూర్ ఐటీ SEZ, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, ఇతర రాష్ట్రాల, దేశాల నుంచి రాకపోకలకు అవసరమైన ప్రణాళికలు ఉంటాయి. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని అందిస్తారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పారదర్శక పాలసీలు, అంతర్జాతీయ స్థాయి నిపుణుల సహకారం, ISB, NITI Aayog వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ సృష్టించబడుతుంది. 2037 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకనామీగా తీర్చిదిద్దడమే లక్ష్యం.




















