ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu) విద్యార్థులు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా ఉండాలని, ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం మంచిదని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఆయన ఇలా మాట్లాడారు.
‘‘మన పిల్లల్లో తెలివితేటలు చాలా ఉన్నాయి. సమయం తక్కువైనా, మనసు పెట్టి చదివితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో జనాభా తగ్గుతున్న సమయంలో, భవిష్యత్తులో యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ముందుంటుంది. విద్యార్థులు అన్ని విషయాల్లో పట్టు సాధించేలా బలమైన పునాది వేయాల్సిన సమయం ఇది. పిల్లల బలాలు, బలహీనతలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి, లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలి’’ అని చంద్రబాబు సూచించారు.
2029 నాటికి దేశంలో నంబర్ వన్ విద్యా వ్యవస్థ మనదే: లోకేశ్
విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
‘‘సమాజం మనకు ఇచ్చిన రుణాన్ని ‘బడి’ ద్వారా తీర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు. అందుకే విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కలిసి కృషి చేయాలి. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే విద్యా నాణ్యత పెరగడం అత్యవసరం.
విద్యా విలువలను పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఏర్పాటు చేశాం. పిల్లలకు మాక్ అసెంబ్లీ నిర్వహించగా, వారు ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా చర్చించారు. ఇప్పుడు క్లిక్కర్ టెక్నాలజీని పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. పైలట్‌గా భామిని మోడల్ స్కూల్ లో ప్రారంభించాం.
పిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాలు ఎలా ఉన్నాయో నేర్చుకునేందుకు టీచర్లు, విద్యార్థులను పంపుతాం. ‘లీప్ యాప్’ను అందుబాటులోకి తెచ్చాం. పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు యాప్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.
మరుసటి రెండు సంవత్సరాల్లో ఆంధ్రా మోడల్ విద్యా విధానాన్ని అమలు చేస్తామని సీఎం ఆదేశించారు. అది నెరవేరుస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
ప్రభుత్వ పాఠశాలలను చిన్న చూపు చూడొద్దు.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చండి. మట్టిలో దాగి ఉన్న ప్రతిభావంతులను బయటకు తీసుకురాం’’ అని లోకేశ్ తెలిపారు.



















