ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేయడం సరికాదని ఆయన ప్రశ్నించారు.
అప్పులు చేసి, తమ ఆస్తులను తాకట్టు పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే వారు ఆందోళన మార్గం ఎంచుకున్నారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల డిమాండ్లను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు కొలికపూడి స్పష్టం చేశారు.
బకాయిల కోసం కన్నీళ్లతో పోరాటం చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి తగదని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలికారు.


















