తలకు పాగా, లుంగీ కట్టుకుని, కర్ర ఆధారంతో నడుస్తూ గ్రంథాలయం బీరువా నుంచి పుస్తకాన్ని తీసుకుంటున్న ఈ వ్యక్తి ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా? ఆయన యాభై ఏళ్లుగా జిల్లా గ్రంథాలయ సభ్యత్వం కలిగిన సీనియర్ పాఠకుడు, మహబూబాబాద్ శివారు ఈదులపూసపల్లికి చెందిన బత్తిని రాములు. వయసు సుమారుగా ఏడు పదులదరికి చేరింది. కర్ర సహాయంతో నడుస్తున్నప్పటికీ, పుస్తకానికి దూరం కాలేదు. 1970లో కేవలం రూ.10 రుసుంతో సభ్యత్వం పొందిన రాములు, ప్రతి వారం మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రంథాలయాన్ని సందర్శిస్తున్నారు. ఆసక్తికరమైన పుస్తకాన్ని కనీసం ఒక గంట వెతికి తీసుకుంటారు. చదివి తిరిగి ఇచ్చి, కొత్త పుస్తకాన్ని తీసుకెళ్తారు. గీత వృత్తికారుడైన రాములు ఇప్పటివరకు 300కు పైగా పుస్తకాలు చదివినట్లు గుర్తించారు. గత ఏడాదే ఆయనను సీనియర్ పాఠకుడిగా సన్మానించినట్లు అధికారులు తెలిపారు.


















