చైనా అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని చేరుకోనుంది. తొలిసారిగా పాకిస్థాన్ వ్యోమగామిని తమ మానవ సహిత అంతరిక్ష కేంద్రం (CMSA) ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుతో చైనా–పాకిస్థాన్ అంతరిక్ష సహకారానికి కొత్త దశ ప్రారంభం కానుంది.
చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ (CMSA) ప్రతినిధి జాంగ్ జింగ్బో వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ అంతరిక్ష కేంద్రం ఎంపిక చేసిన ఇద్దరు వ్యోమగాములు త్వరలో చైనా వ్యోమగాములతో కలిసి శిక్షణ పొందనున్నారు. వారిలో ఒకరిని పెలోడ్ స్పెషలిస్ట్‌గా ఎంపిక చేసి స్వల్పకాలిక అంతరిక్ష మిషన్‌లో భాగం చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మిషన్‌లో పాక్ వ్యోమగామి శాస్త్రీయ ప్రయోగాలు, సాంకేతిక ప్రదర్శనల్లో చైనా బృందానికి సహకరించనున్నారు.
అంతరిక్ష రంగంలో చైనా వేగంగా ముందుకు సాగుతోందని జింగ్బో పేర్కొన్నారు. 2030 నాటికి తమ వ్యోమగామిని చంద్రుడిపై దింపే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొత్త వ్యోమగాముల బృందాన్ని త్వరలో ప్రకటించనున్నారు.
టియాంగాంగ్ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భాగంగా కొత్త బృందం నియమించేందుకు కూడా చైనా సిద్ధమైంది. జాంగ్ లు, వు ఫీ, జాంగ్ హాంగ్ జాంగ్ అనే వ్యోమగాములు తాజా మిషన్‌లో పాల్గొననున్నారు. ఈ మిషన్ చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం రాత్రి 11:44 గంటలకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆసక్తికరంగా, ఈ మిషన్‌లో వ్యోమగాములు నాలుగు ఎలుకలను కూడా తమతో పాటు అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా చైనా అంతరిక్ష సాంకేతికతలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోనుంది, అలాగే పాకిస్థాన్ అంతరిక్ష ప్రయాణాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభించనుంది.




















