ఉత్తరప్రదేశ్‌లోని అన్ని విద్యాసంస్థల్లో ఇకపై వందేమాతరం గేయాలాపనను తప్పనిసరిగా నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థలో వందేమాతరాన్ని పాడడం ఇప్పుడు తప్పనిసరి అని ఆయన గోరఖ్‌పుర్‌లో ‘ఏక్తా యాత్ర’ కార్యక్రమంలో ప్రకటించారు. విద్యాసంస్థల్లో జాతీయ గీతాలను పాడించడం ద్వారా చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ గౌరవం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వందేమాతరం గేయానికి నవంబర్ 7న 150 ఏళ్లు పూర్తి అయ్యాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల భారతీయులలో స్ఫూర్తిని నింపిన ఈ గేయాన్ని కేంద్ర ప్రభుత్వం వార్షికంగా జరుపుకునేలా నిర్ణయించింది. ఈ గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ రచించగా, మొదటగా ఆయన రాసిన ‘ఆనంద్ మఠ్’ నవలలో ప్రచురించబడింది. శుక్రవారం దిల్లీలో వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ గేయాన్ని ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అని వివరించారు. ఈ శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి భవిష్యత్తుకు సరికొత్త భరోసాను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.




















